Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంకెన్నేళ్లు క్రికెట్ ఆడతాడో చెప్పిన సౌతాఫ్రికా దిగ్గజం

- కోహ్లీ మరో మూడునాలుగేళ్లు క్రికెట్ ఆడతాడన్న టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్
- సచిన్ వంద సెంచరీల రికార్డును బద్దలుగొట్టాలని అందరూ కోరుకుంటున్నారన్న మాజీ
- జాఫర్ అభిప్రాయాన్ని సమర్థించిన సౌతాఫ్రికా దిగ్గజం హర్షలే గిబ్స్
టీమిండియా మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో మూడునాలుగేళ్లు క్రికెట్‌లో కొనసాగుతాడని, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బద్దలుగొడతాడని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ జోస్యం చెప్పాడు. 36 ఏళ్ల కోహ్లీ ప్రస్తుతం 82 సెంచరీలతో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం సాధించడానికి ముందు కోహ్లీ పరుగుల కోసం చాలా కష్టపడ్డాడు. వరుసగా విఫలమవుతూ ఇంటాబయట విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, పాక్‌పై సెంచరీతో విమర్శలకు అడ్డుకట్ట పడింది.
బుధవారం జరిగిన ఇండియా కార్పొరేట్ క్రికెట్ లీగ్ ‘కార్పొరేట్ టీ20 బాష్’ (ఐసీబీటీ20) ప్రారంభోత్సవం సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ.. క్రికెట్ అభిమానిగా కోహ్లీని వీలైనంత ఎక్కువగా చూడాలని అనుకుంటానని అన్నాడు. పాకిస్థాన్‌పై కోహ్లీ ప్రదర్శించిన ఫామ్ చూసిన తర్వాత అతడు జట్టు నుంచి తప్పుకోవాలని ఎవరూ అనుకోరని పేర్కొన్నాడు. అతడు పరుగులు చేస్తే ప్రతి ఒక్కరు సంతోషిస్తారని అన్నాడు. విరాట్ మరో మూడు నాలుగేళ్లు ఆడాలని, రికార్డులు బద్దలుగొట్టాలని అందరూ అనుకుంటున్నారని తాను చెప్పగలనని పేర్కొన్నాడు.
సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేసినప్పుడు ఆ రికార్డును మరెవరూ బద్దలు కొట్టలేరని అనుకున్నారని, కానీ, 2010 నుంచి విరాట్ సాధిస్తున్న పరుగులను బట్టి అతడు ఆ అసాధ్యమైన రికార్డును బద్దలు కొడతాడని అనిపించిందని ఈ మాజీ బ్యాటర్ పేర్కొన్నాడు. తన రికార్డును విరాట్ బ్రేక్ చేస్తే సచిన్ కూడా సంతోషిస్తాడని పేర్కొన్నాడు.
ఐసీబీటీ20 బ్రాండ్ అంబాసిడర్ అయిన సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ హర్షలే గిబ్స్ మాట్లాడుతూ జాఫర్ అభిప్రాయాలను సమర్థించాడు. కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందన్నాడు. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ చాలా కఠినంగా ఉంటాడని, కాబట్టి అతడు మరో నాలుగేళ్లు క్రికెట్‌లో కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ కూడా ఏబీ డివిలియర్స్ లాంటివాడేనని, కాకపోతే కొంచెం ముందుగా రిటైరయ్యాడని చెప్పాడు. అయితే, ఫిట్‌నెస్ విషయంలో వారిలో ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. విరాట్ పరుగుల దాహార్తి నమ్మశక్యం కాకుండా ఉందని గిబ్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా చేజింగ్‌లో ఒత్తిడిని ఎదుర్కొనే విధానం అసాధారణమైనదని ప్రశంసించాడు. చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయన్న గిబ్స్.. శుభమన్ గిల్ ప్రత్యేకమైన ఆటగాడని ప్రశంసించాడు.