Gorantla Madhav: కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన గోరంట్ల మాధవ్

- గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు
- మార్చి 5న విచారణకు రావాలన్న పోలీసులు
- ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మాధవ్ మండిపాటు
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 5న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని తాను విమర్శించానని... అందుకే తనపై కక్ష కట్టారని అన్నారు.
నేరాలు చేసే వాళ్లని వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. దీనికి కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ చేష్టలు, అక్రమ కేసులకు రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదని అన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మైండ్ లో పెట్టుకోవాలని సూచించారు.
ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోందని మాధవ్ మండిపడ్డారు. విజయవాడ పోలీసులు ఇచ్చిన నోటీసులను తీసుకున్నానని తెలిపారు. మార్చి 5న విచారణకు రావాలని చెప్పారని... న్యాయవాదుల సలహా తీసుకుని విచారణకు వెళతానని చెప్పారు.