Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీపై గన్నవరంలో మరో కేసు నమోదు

Another case filed against YCP leader Vallabhaneni Vamsi

  • మర్లపాలేనికి చెందిన జాస్తి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు  
  • ఈ కేసులో వంశీని ఏ1గా చేర్చిన వైనం
  • సాగు చేసుకుంటున్న రైతులను బలవంతంగా ఖాళీ చేయించి స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ
  • ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న భూమి ఇవ్వకుండా మోసం చేశారన్న ఫిర్యాదుదారు

ఇప్పటికే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరంలో మరో కేసు నమోదైంది. నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో ఇప్పటికే మూడు కేసులు ఆయనపై నమోదయ్యాయి. తాజాగా మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళీకృష్ట ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

మురళీకృష్ణ, పోలీసుల కథనం ప్రకారం.. మర్లపాలెం శివారులో 18 ఎకరాల్లో పానకాల చెరువు ఉంది. ఆ చెరువులోని కొంత భాగాన్ని 15 మంది గ్రామస్థులు నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. 2023లో ఎమ్మెల్యేగా ఉన్న వంశీ ఆ భూములు ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రజా ప్రయోజనం కోసం ఆ చెరువును అభివృద్ధి చేస్తానంటూ ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. 

అనంతరం ఆ భూముల్లో మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకున్నారు. రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని చెప్పి, మోసం చేశారంటూ మురళీకృష్ణ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు వంశీని ఏ1గా, అనగాని రవిని ఏ2గా, రంగాను ఏ3గా, శేషును ఏ4గా, మేచినేని బాబును ఏ5గా చేర్చి దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News