Uttar Pradesh: తాగిన మైకంలో వరుడి నిర్వాకం... చెంప చెళ్లుమనిపించిన వధువు... పెళ్లి క్యాన్సిల్!

- వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో పూలమాల వేసిన వరుడు
- దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- యూపీలోని బరేలీలో ఘటన
యూపీలోని బరేలీలో ఓ వరుడు మద్యం మత్తులో నిర్వాకానికి పాల్పడ్డాడు. వధువు మెడలో వేయాల్సిన పూలమాలను ఆమె స్నేహితురాలి మెడలో వేశాడు. దీంతో వధువు... వరుడి చెంపచెళ్లుమనిపించింది. ఆ తర్వాత పెళ్లిని రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో రెండు కుటుంబాలు ఘర్షణకు దిగాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే... వధువు పేరు రాధా దేవి. ఆమె వయసు 21 ఏళ్లు. వరుడి పేరు రవీంద్ర కుమార్. అతని వయసు 26 ఏళ్లు. ఊరేగింపుతో వేదిక వద్దకు ఆలస్యంగా వచ్చిన వరుడు... తాగిన మైకంలో వధువు మెడలో కాకుండా... పక్కనే ఉన్న వధువు బెస్ట్ ఫ్రెండ్ మెడలో పూలమాల వేశాడు.
వరుడి కుటుంబం అదనపు కట్నం డిమాండ్ చేయగా వధువు ఫ్యామిలీ తాము ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దాంతో వరుడు కావాలనే తాగి పెళ్లికి వచ్చినట్లు తెలిసింది. పెళ్లికూతురు తండ్రి పెళ్లికి ముందు రూ. 2.5 లక్షలు, పెళ్లి రోజు మరో 2 లక్షలు ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని పెళ్లికుమారుడు... తన ఫ్రెండ్స్‌తో కలిసి తాగి పెళ్లి వేదిక వద్దకు వచ్చాడు.
తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న వరుడు... స్నేహితులతో తాగి వచ్చి కావాలని వధువు ఫ్యామిలీతో అమర్యాదగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. పూలమాలను మార్చుకునే సమయంలో... అనుకోకుండా పెళ్లికూతురి మెడలో కాకుండా... ఆమె పక్కనే ఉన్న మరో అమ్మాయి మెడలో మాలను వేశాడు.
దీంతో ఆగ్రహించిన రాధాదేవి... వరుడి చెంపపై కొట్టి, అక్కడ నుంచి వెళ్లిపోయింది. పెళ్లి చేసుకునేది లేదని తేల్చిచెప్పింది. వరుడు రవీంద్ర కుమార్ కుటుంబంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.