Konda Surekha: శివరాత్రి ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష, ఏర్పాట్లపై ఆదేశాలు

- ఆలయాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్న కొండా సురేఖ
- తాగునీటి వసతి, విద్యుద్దీపాల అలంకరణ వంటి ఏర్పాటు చేయాలన్న మంత్రి
- సమన్వయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్న మంత్రి
రేపు మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవాలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శివరాత్రి సందర్భంగా ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వేములవాడ, కాళేశ్వరం, కీసర, ఏడుపాయలు, రామప్ప, పానగల్లు, పాలకుర్తి, వరంగల్ వేయి స్థంభాల గుడి, కాశిబుగ్గ శివాలయం, భద్రకాళి ఆలయం తదితర దేవాలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆయా దేవాలయాల్లోని ఏర్పాట్లపై అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం రుద్రాభిషేకం, సామూహిక బిల్వార్చన, రుద్ర హోమం, ప్రవచనాలతో పాటు క్యూలైన్ మేనేజ్‌మెంట్, తాగునీటి వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విద్యుత్ వసతి, వాహనాల పార్కింగ్, విద్యుద్దీపాల అలంకరణ, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు వంటి వాటిని ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలను సమన్వయం చేయడానికి హైదరాబాద్‌లోని ఎండోమెంట్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోన్ని అన్ని దేవాలయాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేలా జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అన్నారు.