Rajinikanth: జయలలిత ఇంటికి వెళ్లి నివాళి అర్పించిన రజనీకాంత్

- నిన్న జయలలిత 77వ జయంతి
- పోయస్ గార్డెన్ లోని ఆమె నివాసానికి వెళ్లి నివాళి అర్పించిన రజనీ
- జయ కీర్తి ప్రతిష్టలు కలకాలం నిలిచిపోతాయని వ్యాఖ్య
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత 77వ జయంతి సందర్భంగా నిన్న చెన్నైలోని పోయస్ గార్డెన్ లో ఉన్న ఆమె నివాసానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్లారు. ఆమె చిత్రపటానికి పూలు చల్లి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జయలలిత మేనకోడలు, మేనల్లుడితో ఆయన కాసేపు ముచ్చటించారు.
అనంతరం మీడియాతో రజనీకాంత్ మాట్లాడుతూ... సినీ పరిశ్రమలో జయలలిత ఎంతో బిజీగా ఉన్నప్పుడే ఆమెతో నటించే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు. 1977లో ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చిందని... ఆమెతో ఆ సినిమా గురించి మాట్లాడేందుకు తొలిసారి ఆమె నివాసానికి వచ్చానని తెలిపారు. జయలలిత మన మధ్య లేకపోయినా... ఆమె అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. ఆమె కీర్తి ప్రతిష్టలు కలకాలం నిలిచిపోతాయని అన్నారు.