YSRCP: కిడ్నాప్, హత్యాయత్నం కేసులో వైసీపీ నేత అరెస్టు

ysrcp councillor arrested in guntur kidnap case
  • కిడ్నాప్, హత్యాయత్నం కేసులో తెనాలి వైసీపీ కార్పొరేటర్‌ను అరెస్టు చేసిన పోలీసులు
  • కార్పెంటర్ షేక్ మస్తాన్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన వైనం
  • పది లక్షలు ఇచ్చేలా ఒప్పందంతో తిరిగి తెనాలిలో వదిలిపెట్టిన నిందితుడు 
కిడ్నాప్, హత్యాయత్నం కేసులో తెనాలికి చెందిన  వైకాపా కార్పొరేటర్, అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెనాలి త్రీటౌన్ సీఐ రమేశ్ బాబు తెలిపిన సమాచారం మేరకు.. వైకాపా కౌన్సిలర్ అహ్మద్ బేగ్ ఈ నెల 5న కార్పెంటర్ షేక్ మస్తాన్ వలిని పట్టపగలే కారులో బలవంతంగా ఎక్కించుకుని విజయవాడ వరకూ తీసుకువెళ్లారు. 

కారులో అతన్ని చితకబాదుతూ డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. బాధితుడితో పది లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని తిరిగి తెనాలిలో వదిలిపెట్టాడు. బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అహ్మద్ బేగ్‌పై గతంలో రెండు కిడ్నాప్ కేసులు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో పలు దౌర్జన్యాలకు పాల్పడటంతో అతనిపై రౌడీ షీట్ కూడా తెరిచారు. 

ఘటన జరిగిన నాటి నుండి పరారీలో ఉన్న అహ్మద్, అతనికి సహకరించిన రహమాన్ తెనాలికి వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు షేక్ ఇర్ఫాన్, షేక్ హుమయూన్ క్రిస్టీ పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. 
YSRCP
Telani
Councillor Arrest
Andhra Pradesh

More Telugu News