Mohammed Shami: చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా స్టార్ షమీ ప్రపంచ రికార్డు

- బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో షమీ 5 వికెట్ల ప్రదర్శన
- వన్డేల్లో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు
- ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు బద్దలు
- టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ రికార్డు కూడా బ్రేక్
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు వేదికైన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పలు రికార్డులకు సాక్షిగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీని ఘనంగా ప్రారంభించింది. 5 వికెట్ల ప్రదర్శన చేసిన భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆల్ టైం రికార్డును బద్దలుగొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సూపర్ స్టార్ మిచెల్ స్టార్క్ రికార్డు బద్దలైంది.
200 వికెట్లు పడగొట్టేందుకు స్టార్క్ కంటే షమీకి రెండు ఇన్నింగ్స్‌లు ఎక్కువే అవసరమైనప్పటికీ, స్టార్క్ కంటే అతి తక్కువ బంతుల్లోనే ఆ ఘనత సాధించాడు. షమీ 104 మ్యాచుల్లో 5,126 బంతుల్లో 200 వికెట్లు పడగొడితే, స్టార్క్ 102 ఇన్నింగ్స్‌లలో 5,240 బంతుల్లో 200 వికెట్లు పడగొట్టాడు. దీంతో వన్డేల్లో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు సాధించిన బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. అలాగే, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ రికార్డును కూడా షమీ బద్దలు గొట్టాడు. అగార్కర్ 133 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు సాధించగా, షమీ 104 మ్యాచుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.