Mamata Banerjee: అది మహాకుంభ్ కాదు... మృత్యుకుంభ్: మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు

- ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా
- కుంభమేళా అంటే తనకు గౌరవం ఉందన్నమమతా బెనర్జీ
- కానీ సామాన్యులు కుంభమేళాకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన
- యూపీ సర్కారు వీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు చేసిందని ఆగ్రహం
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అది మహా కుంభ్ కాదు... మృత్యు కుంభ్ అని అభివర్ణించారు. కుంభమేళా అంటే తనకు గౌరవం ఉందని, పవిత్ర గంగమ్మ తల్లి అంటే తనకు పూజ్యభావం ఉందని తెలిపారు. కానీ యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేవలం వీఐపీల కోసమే ఏర్పాట్లు చేసిందని, సామాన్యులకు కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని మమతా విమర్శించారు. కుంభమేళాలో సంపన్నులు రూ.1 లక్ష ఖర్చు చేసి టెంట్లు సొంతం చేసుకుంటున్నారని, కానీ పేదవాళ్లు అంత ఖర్చు చేయగలరా? అని ప్రశ్నించారు.
తొక్కిసలాట జరిగే అవకాశాలున్నాయని తెలిసినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అని యోగి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఓ ప్రణాళిక లేకుండా ఇంతటి భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని మమతాబెనర్జీ ధ్వజమెత్తారు.