summer: ఇంకా శివరాత్రే రాలేదు.. బాబోయ్.. ఇవేం ఎండలు!

- ఫిబ్రవరిలోనే సూర్యప్రతాపం
- తెలంగాణలో చాలా జిల్లాల్లో 37.7 డిగ్రీలు
- ఏప్రిల్, మే నెలలలో ఎండల మంటేనన్న ఆందోళన
సంక్రాతికి చలి గజగజా వణికిస్తుందని.. ఆ చలే శివరాత్రికి శివ శివా అంటూ వెళ్లిపోతుందని పెద్దలు అంటుంటారు. అయితే ఇంకా మార్చి నెలే రానేలేదు.. శివరాత్రికే ఇంకా సమయం ఉంది. మరి.. అప్పుడే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటలకే సూరీడు సుర్రు మంటున్నాడు. ఇళ్లలో కరెంటు పోతే ఉక్కబోత తప్పడం లేదు. వ్యవసాయ పనుల్లో వుండే రైతులపైనా ఈ ప్రభావం పడుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడింటి దాకా విశ్రాంతి తీసుకొని, ఉదయం, సాయంత్రం వేళల్లో సాగు పనులు చేసుకుంటున్నారు.
ఇక ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే.. ఏప్రిల్‌లో, ఆపై మండు వేసవి అయిన మే నెలలో ఇంకేస్థాయిలో దంచికొడతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం తెలంగాణలో 35.6 డిగ్రీల నుంచి 37.7 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలుగా రికార్డయింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, వనపర్తి, సంగారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి, నారాయణ్‌పేట్, నల్లగొండ జిల్లాల్లో 37.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.