Andhra Pradesh: ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. దేశ, విదేశీ పారిశ్రామిక వేత్తలకు మంత్రి సవిత ఆహ్వానం

AP Minister Savitha In Textile Samvad
  • ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ భారత్ టెక్స్ – 2025లో పాల్గొన్న మంత్రి సవిత
  • దేశ, విదేశీ పారిశ్రామిక వేత్తలతో భేటీ
  • చేనేత రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని వినతి
ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ భారత్ టెక్స్-2025 కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పలువురు దేశ, విదేశీ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో పాటు పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ టెక్స్-2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత మండపంలో ప్రధాన నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత పలువురు పారిశ్రామిక వేత్తలను కలిశారు. ఏపీలో  చేనేత రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఇటీవలే నూతన టెక్స్‌టైల్స్ పాలసీని తీసుకొచ్చినట్లు వివరించారు. పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అనువైన ప్రాంతమని, పరిశ్రమల స్థాపనకు తక్షణ అనుమతులు, రాయితీలు ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో చేనేత రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను మంత్రి ఆహ్వానించారు. 

ఏపీలో టెక్స్‌టైల్స్ రంగానికి అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రపంచంలోనే మేలైన పట్టు, చేనేత వస్త్రాలు తమ రాష్ట్రంలో ఉత్పత్తవుతున్నాయని తెలిపారు. చేనేత వస్త్రాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పనలో భాగంగా రాష్ట్రంతో పాటు దేశంలోని పలు నగరాల్లో చేనేత ఎగ్జిబిషన్లు, ఎక్స్ పోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పావనమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు. 
Andhra Pradesh
Savitha
Textile Samvad

More Telugu News