Kesineni Nani: చాన్నాళ్ల తర్వాత తెరపైకి వచ్చిన కేశినేని నాని

- గత ఎన్నికల్లో తమ్ముడి చేతిలో ఓటమి
- రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు అప్పట్లో ప్రకటన
- తాజాగా నందిగామలో ఓ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ కేశినేని నాని
గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి, లోక్ సభ ఎన్నికల్లో ఓటమిపాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చాన్నాళ్ల తర్వాత తెరపైకి వచ్చారు. గత ఎన్నికల్లో తమ్ముడు కేశినేని చిన్ని (శివనాథ్) చేతిలో ఓటమిపాలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మేరకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన కూడా చేశారు.
తాజాగా, నందిగామలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా, ప్రజా సేవను మాత్రం వీడలేదని స్పష్టం చేశారు. పదవిలో లేకపోయినా ప్రజలకు అందుబాటులోనే ఉంటానని పేర్కొన్నారు. గత పదేళ్లు ఎవరి దగ్గరా కప్పు టీ కూడా తాగకుండా పనిచేశానని వ్యాఖ్యానించారు.
తనకు బెజవాడ అంటే పిచ్చి అని అన్నారు. విజయవాడ తనకు రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిందని, నగర అభివృద్ధికి ఎప్పటికీ కట్టుబడి ఉంటానని తెలిపారు.
అసాధ్యం అనుకున్న దుర్గ గుడి ఫ్లై ఓవర్ ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి సాకారం చేశానని చెప్పుకొచ్చారు. కాగా, గతంలో తాను అనేక పనులు చేసినా, వాటిని విస్మరించారని కేశినేని నాని విచారం వ్యక్తం చేశారు.