Graduate MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు... నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

- ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఫిబ్రవరి 27న పోలింగ్... మార్చి 3న ఓట్ల లెక్కింపు
- నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఏపీలో త్వరలో తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి... ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఎన్నిక మనకు పరీక్ష వంటిదే... అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించాలి అని స్పష్టం చేశారు.
నేతలు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుని ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి 93 శాతం స్ట్రయిక్ రేట్ తో విజయం అందించారని... ప్రజల నమ్మకం నిలబెట్టుకునేందుకు నిత్యం పనిచేస్తున్నామని అన్నారు. వ్యవస్థలను చక్కదిద్ది, పాలనలో స్పష్టమైన మార్పు తెచ్చామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇచ్చిన హామీల మేరకు యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించామని చంద్రబాబు వెల్లడించారు.