Secretariat Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కీలక ప్రకటన చేయనున్న ఏపీ ప్రభుత్వం

- త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- ఈ సమావేశాల్లో సచివాలయ ఉద్యోగులపై ప్రకటన చేసే అవకాశం
- రేపు సచివాలయ ఉద్యోగుల సంఘాలతో మంత్రి బాలవీరాంజనేయస్వామి సమావేశం
ఏపీలో గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్ల నియామకాలు జరిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు వాలంటీర్లు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేయడంతో, ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వంలోని ఇతర శాఖల్లోకి తీసుకోవాలన్న ప్రతిపాదన ఉంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక... మూడు కేటగిరీల కింద సచివాలయాలకు కేటాయించిన ఉద్యోగులు పోను, ఇంకా 40 వేల మంది ఉద్యోగులు మిగిలినట్టు తెలుస్తోంది. వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి తీసుకునేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.
త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా... ఈ సమావేశాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో, రేపు (ఫిబ్రవరి 17) మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలతో సమావేశం కానున్నారు. ఆయా సంఘాల నుంచి వినతులు, సూచనలు స్వీకరించనున్నారు. దీనిపై నివేదిక రూపొందించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో ప్రకటన ఉంటుంది.