Vijayawada: మంగళగిరిలో 5 కిలోల బంగారు నగలు చోరీ.. సిబ్బంది పనేనని పోలీసుల అనుమానం

5 kg gold jewellery missing in mangalagiri Police suspect delivery boy

  • డెలివరీ ఇచ్చేందుకు తీసుకెళుతుండగా దొంగతనం జరిగిందని ఫిర్యాదు
  • గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని చెబుతున్న డెలివరీ బాయ్
  • సీసీటీవీ కెమెరాల్లో అనుమానాస్పద కదలికలు లేవంటున్న పోలీసులు

ఏపీలో శనివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 5 కిలోల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. నగలను డెలివరీ ఇచ్చేందుకు తీసుకెళుతుండగా ఈ చోరీ జరిగింది. జ్యువెలరీ షాపు సిబ్బందిని బెదిరించి నగల సంచీని ఎత్తుకెళ్లారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, దొంగతనం జరిగిందని చెబుతున్న ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. అక్కడ దొంగతనం జరిగిన ఆనవాళ్లు కనిపించడం లేదంటున్నారు. జ్యువెలరీ షాప్ డెలివరీ బాయ్ పై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరిలో శనివారం రాత్రి జరిగిందీ ఘరానా దొంగతనం.

జ్యువెలరీ షాపు యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి విజయవాడలోని షాపు నుంచి 5 కేజీల బంగారు ఆభరణాల బ్యాగ్ ను తీసుకుని డెలివరీ బాయ్ దివి నాగరాజు మంగళగిరిలోని తన ఇంటికి స్కూటీపై బయలుదేరాడు. ఈ నగలను ఆదివారం కోదాడలో డెలివరీ ఇవ్వాల్సి ఉంది. అయితే, ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు తనను అడ్డగించి నగల బ్యాగ్ ఎత్తుకెళ్లారని యజమానికి సమాచారం అందించాడు. దీంతో యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అండర్ పాస్ వద్ద విచారించారు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దొంగతనం జరిగిన ఆనవాళ్లు కానీ, అనుమానాస్పద కదలికలు కానీ కనిపించకపోవడంతో డెలివరీ బాయ్ దివి నాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే షాపులో పనిచేస్తున్న నాగరాజు బంధువు దివి రామును కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News