Krishnaveni Death: తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణిది ఓ ప్రత్యేక అధ్యాయం: బాలకృష్ణ

- నటి కృష్ణవేణి మృతి వ్యక్తిగతంగా తమకు తీరని లోటని వ్యాఖ్య
- ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
- కృష్ణవేణి కుటుంబానికి సానుభూతి తెలియజేసిన బాలకృష్ణ
నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణిది ఓ ప్రత్యేక అధ్యాయమని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నటజీవితానికి బాట వేసిన కృష్ణవేణి శివైక్యం చెందడం బాధాకరమని అన్నారు. 'మన దేశం' లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి ఆమె కృషి చేశారని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఎన్నో అవార్డులు అందుకున్నారని తెలిపారు.
ఇటీవల నిర్వహించిన ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలలో, అంతకుముందు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో కృష్ణవేణిని ఘనంగా సత్కరించామని గుర్తుచేశారు. కృష్ణవేణి మృతి వ్యక్తిగతంగా తమకు తీరని లోటు అని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా కృష్ణవేణి కుటుంబ సభ్యులకు నందమూరి బాలకృష్ణ సానుభూతి తెలిపారు.