Chicken Centres: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. ఆదివారం వెలవెలబోతున్న చికెన్ సెంటర్లు

- వారం రోజులుగా ఇదే పరిస్థితి అంటూ వ్యాపారుల ఆవేదన
- అమ్మకాలు పడిపోయినా రేటు మాత్రం తగ్గని వైనం
- మటన్, చేపలకు పెరిగిన డిమాండ్
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో తెలంగాణలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. ఆదివారం పూట కిటకిటలాడే చికెన్ సెంటర్లు ఈ రోజు మాత్రం వెలవెలబోతున్నాయి. అయినప్పటికీ చికెన్ ధరలు మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ప్రతీ ఆదివారం బిజీబిజీగా గడిపే చికెన్ సెంటర్ వ్యాపారులు ఈ వారం ఖాళీగా కనిపిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ తినడానికి ధైర్యం చేయడంలేదు. ఆదివారం కావడంతో మటన్, చేపలు కొనుగోలు చేస్తున్నారు.
ప్రజల్లో బర్డ్ ఫ్లూ భయం పెరుగుతున్నా చికెన్ ధరల్లో మాత్రం మార్పు కనిపించడంలేదు. కిందటి వారం కేజీ చికెన్ రూ.220 నుంచి రూ.240 ఉండగా.. ఈ రోజు హైదరాబాద్, విజయవాడలో రూ.220, చిత్తూరులో రూ.160 కి అమ్ముతున్నారు. చికెన్ అమ్మకాలు పడిపోవడం, గిరాకీ పెరగడంతో చేపల వ్యాపారులు రేట్లు పెంచి అమ్ముతున్నారు.