Delhi Railway Station: చివరి నిమిషంలో ప్లాట్ ఫాం మారిందనడంతో గందరగోళం

- ఒక్కసారిగా జనం మెట్లవైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట
- 18 మంది మృతి.. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలు
- మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం.. కేంద్రం ప్రకటన
చివరి నిమిషంలో ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫాం మారిందనే ప్రచారమే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాటకు దారితీసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫాం నెంబర్ 14 పైకి వస్తుందని, 10:10 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తొలుత అనౌన్స్ మెంట్ చేశారు. ఈ ట్రైన్ కు దాదాపు 1500 జనరల్ టికెట్లు అమ్మినట్లు తెలుస్తోంది. ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు ఈ టికెట్లు కొనుగోలు చేసిన జనం 14వ నెంబర్ ప్లాట్ ఫాంపైకి చేరుకున్నారు. అదే ప్లాట్ ఫాంపైకి రావాల్సిన స్వతంత్రతా సేనాని ఎక్స్ ప్రెస్, 13వ నెంబర్ ప్లాట్ ఫాంపైకి రావాల్సిన భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్ల కోసం అప్పటికే ఆయా ప్లాట్ ఫాంలపైన పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు.
ఆ రెండు రైళ్లు ఆలస్యం కావడంతో ప్లాట్ ఫాంలపై రద్దీ పెరిగిపోయింది. రాత్రి 9:55 గంటలకు ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ మరో ప్లాట్ ఫాంపైకి వస్తుందనే ప్రచారం జరిగింది. ట్రైన్ బయలుదేరడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు 14వ నెంబర్ ప్లాట్ ఫాంపై వేచి ఉన్న జనమంతా మెట్లవైపు కదిలారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో కదలడమే కష్టమవుతుండగా రైలు ఎక్కడ వెళ్లిపోతుందోననే ఆందోళనతో తోపులాట జరిగింది. మెట్లపైకి జనం ఒక్కసారిగా చేరడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మహిళలు, పిల్లలు మెట్లపై పడిపోయారు. దీంతో జనం వారిని తొక్కుకుంటూ వెళ్లారు.
ఈ ఘటనలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 18 మంది చనిపోయారు. మరో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపింది. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.
