actress krishnaveni: ఎన్టీఆర్ ను వెండితెరకు పరిచయం చేసిన అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూత

- హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో కన్నుమూసిన నిర్మాత కృష్ణవేణి
- తెలుగు చిత్రసీమకు గొప్ప గొప్ప కళాకారులను పరిచయం చేసిన వైనం
- నటిగా, నేపథ్య గాయనిగా, నిర్మాతగా తెలుగు చిత్ర సీమలో గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవేణి
తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన అలనాటి ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. వయోభార సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణవేణి ఆదివారం ఉదయం ఫిల్మ్ నగర్‌లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. తెలుగు సినీ పరిశ్రమకు గొప్ప గొప్ప కళాకారులను పరిచయం చేసి గౌరవప్రదమైన నిర్మాతగా ఆమె మంచి గుర్తింపు అందుకున్నారు. 'మనదేశం' సినిమాతో సీనియర్ ఎన్టీఆర్‌ను కృష్ణవేణి సినిమా రంగానికి పరిచయం చేశారు. అంతేకాకుండా లెజెండరీ సంగీత దర్శకుడు ఘంటసాలకు కూడా తొలి అవకాశం ఇచ్చిన ఘనత కృష్ణవేణిదే.
పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో జన్మించిన కృష్ణవేణి చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో నాటక రంగంలో ప్రవేశించారు. 1936లో 'అనసూయ' అనే సినిమాలో బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నటిగానే కాకుండా నేపథ్య గాయనిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పాటలు ఆ రోజుల్లో ప్రేక్షకులను విశేషంగా అలరించేవి.
సినీరంగంపై మక్కువతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె 'మనదేశం' అనే చిత్రాన్ని నిర్మించారు. 1949లో విడుదలైన 'మనదేశం' సినిమాతోనే ఎన్టీఆర్ తొలిసారి వెండితెరపై కనిపించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించిన ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ సెలబ్రిటీలు నివాళులర్పిస్తున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తూ ఆమె సినీరంగానికి అందించిన సేవలను స్మరించుకుంటున్నారు.