jannik sinner: డోపింగ్ లో దొరికిన ఏడాది తర్వాత... వరల్డ్ నెంబర్ వన్ యానిక్ సిన్నర్ పై మూడ్నెల్ల నిషేధం

- ఏడాది క్రితం డోపింగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినా వేటు వేయని ఐటీఐఏ
- ఐటిఐఏ తీరుపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో అప్పీల్ చేసిన వాడా
- వాడాతో సిన్నర్ ఒప్పందంతో మూడు నెలల నిషేధానికి అంగీకారం
డోపింగ్‌లో పట్టుబడిన ఏడాది తర్వాత ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సిన్నర్ మూడు నెలల నిషేధం ఎదుర్కొన్నాడు. గత సంవత్సరమే యానిక్‌పై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా నిషేధం నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA)తో సిన్నర్ ఓ అంగీకారానికి వచ్చి మూడు నెలల నిషేధానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. గత నెలలో సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు.
గత ఏడాది డ్రగ్స్ వాడినట్లు సిన్నర్‌పై ఆరోపణలు వచ్చాయి. టెస్టులోనూ అప్పుడు పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ తెలియకుండా జరిగినట్లు చెప్పడంతో అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ITIA) సిన్నర్‌పై నిషేధం వేటు వేయలేదు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల స్థాయిని బట్టి నిర్ణయాలు వేరుగా ఉంటున్నాయంటూ టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఐటీఐఏ తీరుపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)లో ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) అప్పీలు చేసింది. అయితే, వాదనలను వచ్చే ఏప్రిల్ నెలలో వింటామని కాస్ పేర్కొంది.
ఈ క్రమంలో వాడా, సిన్నర్ అంగీకారానికి వచ్చారు. దీంతో అతనిపై మూడు నెలల నిషేధం విధిస్తూ ఐటీఐఏ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల నిషేదం కారణంగా ఫిబ్రవరి 9 నుంచి మార్చి 4 వరకు సిన్నర్ కు ఏ టోర్నీలోనూ ఆడే అర్హత లేదు. ఫ్రెంచ్ ఓపెన్ ఈ ఏడాది మే 25 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిషేధం పూర్తి చేసుకుని బరిలోకి దిగేందుకు సిన్నర్ సిద్ధమవుతాడు.