Bird Flu: అక్కంపల్లి రిజర్వాయర్‌లో వందలాది చచ్చిన కోళ్లు.. బర్డ్‌ఫ్లూ భయంతో వణుకుతున్న హైదరాబాద్, నల్గొండ ప్రజలు

- ఇటీవల పెరుగుతున్న బర్డ్ ఫ్లూ కేసులు
- వందలకొద్దీ చనిపోయిన కోళ్లను రిజర్వాయర్‌లో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- విచారణకు ఆదేశించిన నల్గొండ జిల్లా కలెక్టర్
- నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిన అధికారులు
నల్గొండ జిల్లాలోని అక్కంపల్లి రిజర్వాయర్‌లో వందలాది చచ్చిన కోళ్లు కనిపించడంతో బర్డ్‌ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు చనిపోయిన కోళ్లను రిజర్వాయర్‌లో పడేసినట్టు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, నల్గొండలోని జిల్లాలకు ఈ రిజర్వాయర్ నుంచే తాగునీరు సరఫరా అవుతుండటంతో బర్డ్ ఫ్లూ భయం ప్రజలను వెంటాడుతోంది.
విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించారు. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర దర్యాప్తు ప్రారంభించారు. దేవరకొండ ఆర్డీవో, నీటిపారుదలశాఖ అధికారులు రిజర్వాయర్‌ను పరిశీలించారు. బర్డ్‌ఫ్లూ కేసులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత భయాందోళనకు గురిచేసింది. రిజర్వాయర్‌లో చచ్చిన కోళ్లను పడేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నీటి నమూనాలు సేకరించిన అధికారులు పరీక్షలకు పంపించారు.