Pawan Kalyan: ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల భారీ విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan announces Rs 50 lakhs to NTR Trust

  • విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ నైట్
  • ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • హాజరైన పవన్ కల్యాణ్
  • టికెట్ కొనకుండా వచ్చినందుకు గిల్టీగా ఉందని వెల్లడి
  • వేదికపైనే భారీ విరాళం ప్రకటించిన వైనం

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన భారీ మ్యూజికల్ నైట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల భారీ విరాళం ప్రకటించారు. ఈవెంట్ లో ఆయన ప్రసంగించారు. 

"ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టికెట్ కొనాలని నా సిబ్బందికి చెప్పాను. ఈ విషయం తెలిసి నారా భువనేశ్వరి గారు... టికెట్ ఎందుకండీ... మీరు కార్యక్రమానికి రండి చాలు అన్నారు. కానీ నాకు టికెట్ కొనకుండా రావడం గిల్టీగా అనిపిస్తోంది. అందుకే నా వంతుగా తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల విరాళం ప్రకటిస్తున్నాను. 

నా దగ్గరికి కూడా కొందరు బాధితులు వస్తుంటారు. అలాంటి వారికి సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కార్యాలయానికి లేఖ రాస్తే ఆయన స్పందన అద్భుతంగా ఉంటుంది. ఎంత సేపూ పనేనా... సహాయంలోనూ వినోదం పొందవచ్చని ఈ మ్యూజికల్ నైట్ ద్వారా నిరూపించారు. ఈ కార్యక్రమానికి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు అభినందనలు. 

ఇక, నారా భువనేశ్వరి గారంటే నాకు అమితమైన గౌరవం. ఆమె ఎంత దృఢసంకల్పం ఉన్న వ్యక్తో నాకు తెలుసు. కష్టనష్టాల్లో ఆమె వెనుకంజ వేయకుండా నిలిచిన తీరు స్ఫూర్తిదాయకం. బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే... ఆయనను ఎప్పుడు కలిసినా సర్ అని పిలవాలనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం బాలయ్య అని పిలువు అంటుంటారు. 

బాలకృష్ణ గారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకం... ఆయన ఎవరినీ లెక్క చేసే మనిషి కాదు. తాను అనుకున్న దానిపై గట్టిగా నిలబడతారు. తన నటనతో తరతరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అటు సినిమాలు, ఇటు సేవలు... అందుకే ఆయనకు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది" అని పవన్ కల్యాణ్ వివరించారు.

  • Loading...

More Telugu News