Chandrababu: రూ.1 లక్షతో టికెట్ కొంటేనే నన్ను అనుమతించారు: సీఎం చంద్రబాబు

Chandrababu attends Euphoria Musical Night in Vijayawada

  • ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్
  • టికెట్ కొని హాజరైన సీఎం చంద్రబాబు
  • ఎన్టీఆర్ ఎంత మొండి ఘటమో, భువనేశ్వరి కూడా అంతే మొండి ఘటం అని చమత్కారం

ఎన్టీఆర్ ట్రస్ట్ విజయవాడలో నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తలసేమియా బాధితులకు సహాయం చేసేందుకు ఈ కార్యక్రమం ద్వారా నిధులు సేకరించాలన్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్ మెంట్ ను, సిబ్బందిని అభినందిస్తున్నానని తెలిపారు. 

ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిపై మరింత నమ్మకం పెరిగిందని అన్నారు. హెరిటేజ్ ను సమర్థవంతంగా నడిపించడమే కాదు, ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ను కూడా సమర్థవంతంగా నడిపించే శక్తి ఆవిడకు తండ్రి నుంచి వచ్చింది అని వివరించారు. ఎన్టీఆర్ ఎంత మొండి ఘటమో, భువనేశ్వరి కూడా అంతే మొండి ఘటం అని చంద్రబాబు చమత్కరించారు. 

నాడు ఎన్టీఆర్ ఏ విపత్తు వచ్చినా ఆదుకోవడంలో ముందుండేవారని కొనియాడారు. ఆయన స్ఫూర్తి మనలో ఉందని తెలిపారు. ఇవాళ ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. 

ఇక, ఈ కార్యక్రమానికి వచ్చేందుకు తాను కూడా రూ.1 లక్షతో టికెట్ కొనుక్కుని వచ్చానని చంద్రబాబు వెల్లడించారు. టికెట్ కొనుక్కున్న తర్వాతే ఈ కార్యక్రమానికి అనుమతించారని సరదాగా వ్యాఖ్యానించారు. "నేను డబ్బులు చెల్లించింది ట్రస్ట్ కు కాదు... తలసేమియా బాధితులకు.... అదే నాకు తృప్తి. ఇవాళ వండ్రఫుల్ ఈవెనింగ్... ఇంక ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మీరు (సభికులు) నన్ను క్షమించరు... జై హింద్, జై ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్" అంటూ చంద్రబాబు ప్రసంగం ముగించారు.

కాగా, విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ భారీ ఈవెంట్ కు నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు.

  • Loading...

More Telugu News