Kumbh Mela: కుంభమేళాలో అగ్ని ప్రమాదం... దగ్ధమైన ఏడు టెంట్లు

- దగ్ధమైన దుప్పట్లు, ఆహార సామాగ్రి
- ఎవరికీ ఏమీ కాలేదని అధికారులు వెల్లడి
- సెక్టార్ 19లోని క్యాంపులో సాయంత్రం అగ్ని ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళా ప్రాంతంలోని ఓ స్టోర్ రూంలో ఈరోజు సాయంత్రం మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఏడు టెంట్లు దగ్ధమయ్యాయి. అక్కడే ఉన్న దుప్పట్లు, ఆహార సామగ్రి కూడా దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.
కుంభమేళా చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ శర్మ మాట్లాడుతూ, మహా కుంభమేళాలోని సెక్టార్ 19లోని క్యాంపులో మంటలు చెలరేగాయని తెలిపారు. ఏడు టెంట్లకు మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. తమకు సమాచారం అందగానే రెండు నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు.
మహా కుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ మాట్లాడుతూ, సాయంత్రం 6.15 గంటలకు అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఐదు నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారని వెల్లడించారు. ఆ గుడారాల్లో భక్తులు కూడా ఉన్నారని, కానీ ఎవరికీ ఏమీ కాలేదని ఆయన అన్నారు.