Euphoria Musical Night: బెజవాడలో మ్యూజికల్ నైట్... ఒకే టేబుల్ వద్ద చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ

- తలసేమియా బాధితులకోసం నిధుల సేకరణ
- విజయవాడలో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్
- తమన్ సంగీత సారథ్యంలో కార్యక్రమం
- హాజరైన కూటమి ప్రభుత్వ పెద్దలు
తలసేమియా బాధిత చిన్నారులను ఆదుకునేందుకు నిధుల సేకరణ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ నైట్ పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసింది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యంలో ఈ మ్యూజికల్ నైట్ జరిగింది.
బెజవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృప్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్, బాలయ్య ఒకే టేబుల్ వద్ద కూర్చుని తమన్ సంగీత విభావరిని ఆస్వాదించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఇటీవల మాట్లాడుతూ, సాధారణంగా చంద్రబాబు ఖర్చులకు తానే డబ్బులు ఇస్తుంటానని, కానీ ఈ కార్యక్రమం కోసం చంద్రబాబు తన సొంత ఖాతాలోంచి డబ్బు తీసి టికెట్ కొన్నారని వెల్లడించారు. చంద్రబాబు ఒక టేబుల్ బుక్ చేసుకున్నారని తెలిపారు.
కాగా, కూటమి ప్రభుత్వ పెద్దలు ఒకే టేబుల్ వద్ద కూర్చున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.