Bitcoin: చెత్త కుప్ప కింద వేల కోట్లు అందించే హార్డ్ డిస్క్..!

బ్రిటన్ కు చెందిన జేమ్స్ హోవెల్స్ అనే వ్యక్తి ఇప్పుడో చెత్త కుప్పను కొనేందుకు సిద్ధమయ్యాడు. ఏళ్ల తరబడి చెత్త పొరలుపొరలుగా పేరుకుపోయిన ఆ డంపింగ్ యార్డ్ ను అతడేం చేసుకుంటాడు అనుకోకండి. అసలు విషయం తెలిస్తే విస్మయానికి గురవుతారు.
జేమ్స్ హోవెల్స్ కార్డిఫ్ నగరానికి 19 కిలోమీటర్ల దూరంలోని న్యూపోర్ట్ పట్టణంలో నివసిస్తున్నాడు. అతడు 2013లో ఒక కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ ను పొరపాటున చెత్త కుప్పలో పడేశాడు. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో, ఆ హార్డ్ డిస్క్ ఖాళీదని భావించాడు. అయితే, ఆ హార్డ్ డ్రైవ్ లో అతడి బిట్ కాయిన్ కు సంబంధించిన కీ (పాస్ వర్డ్) ఉంది.
ఆ బిట్ కాయిన్ విలువ ఓ మోస్తరుగా ఉండి ఉంటే ఆ హార్డ్ డ్రైవ్ గురించి అతడు పెద్దగా ఆలోచించేవాడు కాదు కానీ... ఆ బిట్ కాయిన్ విలువ అక్షరాలా రూ.6,933 కోట్లు!
రోజు రోజుకు బిట్ కాయిన్ విలువ పెరిగిపోతుండడంతో హోవెల్స్ లో ఆశ మొదలైంది. బిట్ కాయిన్ ను యాక్సెస్ చేయాలంటే కీ తప్పనిసరి. దాంతో అతగాడు తన హార్డ్ డ్రైవ్ ను ఆ చెత్త కుప్ప నుంచి తిరిగి తీసుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాడు. చెత్త కుప్పను తవ్వుకుంటాను... హార్డ్ డిస్క్ ను వెతుక్కుంటాను అంటూ అధికారులను అనుమతి అడిగితే, వారు నిరాకరించారు.
2021లో అధికారులకు ఏకంగా రూ.600 కోట్లు ఆఫర్ చేశాడు. అయినా అనుమతి దక్కలేదు. చివరికి కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. బ్రిటీష్ హైకోర్టులో ఈ కేసు విచారణ కూడా ఆపేశారు. హార్డ్ డిస్క్ అన్వేషణకు కౌన్సిల్ నుంచి అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హోవెల్స్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేశారు.
దాంతో, చివరి ప్రయత్నంగా జేమ్స్ హోవెల్స్ ఆ చెత్త కుప్ప ఉన్న స్థలం మొత్తాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నాడు. మరి అతడి ప్రణాళిక ఈసారైన ఫలిస్తుందేమో చూడాలి.