Abhishek Sharma: సన్ రైజర్స్ టీమ్ లో అభిషేక్ శర్మకు కీలక బాధ్యతలు?

Sunrisers Hyderabad Vice Captaincy for Abhishek Sharma

  • ఇటీవ‌ల 37 బంతుల్లోనే శ‌త‌కం బాది అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అభిషేక్‌
  • భార‌త జ‌ట్టుకు మ‌రో డాషింగ్ ఓపెన‌ర్ దొరికాడంటూ ప్ర‌శంస‌లు
  • ఇప్పుడు ఈ యంగ్ టాలెంట్ కు మ‌రో బంప‌రాఫ‌ర్ ద‌క్కిన‌ట్లు వార్తలు 
  • అభిషేక్ కు ఎస్‌ఆర్‌హెచ్ వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు ప్రచారం

టీమిండియా యువ ఆట‌గాడు అభిషేక్ శ‌ర్మ ఇటీవ‌ల ముగిసిన ఇంగ్లండ్ టీ20 సిరీస్ లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెలరేగిన విష‌యం తెలిసిందే. అత‌ని బ్యాట్ నుంచి ప‌రుగుల వ‌ర‌ద పారింది. ఈ యంగ్ టాలెంట్ ఏకంగా 37 బంతుల్లోనే శ‌త‌కం బాది అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. దాంతో భార‌త జ‌ట్టుకు మ‌రో డాషింగ్ ఓపెన‌ర్ దొరికాడంటూ కితాబు అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్ లో తానే ఫ్యూచర్ స్టార్ నని నిరూపించుకున్నాడు. అలాంటి అభిషేక్ కు ఇప్పుడు మ‌రో బంప‌రాఫ‌ర్ ద‌క్కిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. 

అభిషేక్ శర్మ ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త సీజ‌న్ లో అద్భుతంగా రాణించాడు కూడా. ఓపెన‌ర్ గా అదిరిపోయే ఆరంభాలు అందిస్తూ జ‌ట్టు విజయాల్లో కీలకంగా మారడంతో ఈసారి వేలంలో అత‌డిని ఫ్రాంచైజీ అంటిపెట్టుకుంది. తాజాగా అభిషేక్ కు ఎస్ఆర్‌హెచ్‌ యాజ‌మాన్యం బంపరాఫర్ ఇచ్చిందని స‌మాచారం. ఐపీఎల్-2025లో ఆ జ‌ట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 

నిలకడగా ర‌న్స్‌ చేయడం, ఒంటిచేత్తో ఫలితాన్ని తారుమారు మార్చ‌గ‌ల స‌త్తా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ ఆటపై దృష్టిసారించ‌డం, తోటి ఆటగాళ్లు అందరితోనూ కలుపుగోలుతనం లాంటివి వైస్ కెప్టెన్సీకి అభిషేక్ బెస్ట్ చాయిస్ గా నిలబెట్టాయని స‌మాచారం.

కాగా, గ‌త సీజ‌న్ లో సన్‌రైజర్స్ కెప్టెన్ గా ఉన్న‌ ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. గాయం కార‌ణంగానే అత‌డు త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా త‌ప్పుకున్నాడు. ఒకవేళ‌ గాయం తీవ్ర‌త అధికంగా ఉంటే... రాబోయే ఐపీఎల్ సీజన్ లోనూ అత‌డు ఆడటం అనుమాన‌మే. 

ఈ నేప‌థ్యంలోనే వచ్చే సీజన్‌ కోసం కొత్త సార‌థితో పాటు వైస్ కెప్టెన్ ను ఎంపిక చేసే పనిలో ఎస్‌ఆర్‌హెచ్ యాజ‌మాన్యం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అభిషేక్ కు వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు ప్రచారం జరుగుతోంది. 

  • Loading...

More Telugu News