Chandrababu: కందుకూరులో మెటీరియల్ రికవరీ సెంటర్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

- నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
- కందుకూరులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
- దూబగుంట గ్రామస్తులతో ముఖాముఖి
సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. కందుకూరులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెటీరియల్ రికవరీ సెంటర్ ప్రారంభించారు. అనంతరం కందుకూరు నియోజకవర్గం దూబగుంట గ్రామస్తులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెత్త నుంచి సంపద సృష్టించేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
గ్రామాల్లో సర్పంచి ప్రథమ పౌరుడు అని, పంచాయతీ నిధులతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచిలదే అని చంద్రబాబు అన్నారు. ఇకపై అన్ని గ్రామాలకు ర్యాంకులు ఇస్తామని, బాగా పనిచేసే సర్పంచిలను సత్కరిస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ గా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మంత్రి నారాయణకు ఓ టార్గెట్ ఇచ్చానని, ఈ ఏడాది గాంధీ జయంతి (అక్టోబరు 2) నాటికి ఏ పట్టణంలోనూ నూటికి నూరు శాతం చెత్త కనిపించకుండా ఉండాలని మున్సిపల్ శాఖకు బాధ్యత అప్పగించానని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, చెత్తపై కూడా పన్నేశారని విమర్శించారు.