Sunita Williams: సునీతా విలియమ్స్, విల్మోర్ భూమికి తిరిగొచ్చాక వారి శారీరక స్థితి ఎలా ఉంటుందో తెలుసా...!

- 8 నెలలుగా అంతరిక్షంలో ఉన్న సునీత, విల్మోర్
- మార్చి 19న తిరుగుపయనం కానున్న నాసా వ్యోమగాములు
- జీరో గ్రావిటీలో ఉన్న వీరికి భూమి మీదకు వచ్చిన తర్వాత సమస్యలు తప్పవట
ఊహించని విధంగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవాల్సి వచ్చిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుల్ విల్మోర్ తిరుగుపయనం ఖరారయింది. దాదాపు 8 నెలల ఎదురు చూపుల తర్వాత మార్చి 19న వీరు భూమి మీదకు బయల్దేరనున్నారు. స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో వీరు భూమి మీదకు రానున్నారు.
అయితే 8 నెలల పాటు జీరో గ్రావిటీలో ఉన్న వీరికి భూమి మీదకు వచ్చిన తర్వాత సమస్యలు తప్పవట. చిన్న పెన్సిల్ లేపినా ఓ డంబెల్ తో వర్కౌట్ చేసినట్టు ఉంటుందట. ఈ విషయాన్ని విల్మోర్ వెల్లడించారు. గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని... భూమి పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో ఎంతో అసౌకర్యంగా అనిపిస్తుందని చెప్పారు. స్పేస్ నుంచి భూమి మీదకు వచ్చిన 24 గంటల్లో ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతూ వస్తారు.
ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లిన వెంటనే శరీరం స్పేస్ ఎనీమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెపుతోంది. ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండటం కూడా వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మైక్రో గ్రావిటీ పరిస్థితులల్లో ఎర్ర రక్తకణాలను నాశనం చేయడం ద్వారా శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. దీనివల్ల నిస్సత్తువ, అలసట, శారీరక, మానసిక పనితీరు మారడం వంటి లక్షణాలు కనిపించొచ్చు. ఎముకల సాంద్రత తగ్గుతుంది. గుండె పనితీరు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.