Home loan: హోంలోన్స్ తీసుకున్న ఖాతాదారులకు ఎస్ బీఐ శుభవార్త

- నెలనెలా చెల్లించే ఈఎంఐ తగ్గించనున్నట్లు ప్రకటన
- ఫిబ్రవరి 15 నుంచే అమలు
- ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో ప్రయోజనం
హోమ్ లోన్స్ తీసుకున్న ఖాతాదారులకు ఎస్ బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. నెలనెలా చెల్లించే ఈఎంఐ తగ్గనుందని తెలిపింది. ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ల (ఆర్ఎల్ఎల్ఆర్) ను తగ్గించినట్లు వివరించింది. ఈ నెల 15 నుంచి సవరించిన రేట్లను అమలులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో ఖాతాదారుల ఈఎంఐ భారం తగ్గుతుందని వివరించింది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 25 బేసిన్ పాయింట్లు తగ్గిస్తూ 6.25 శాతంగా నిర్ణయించడంతో తాము కూడా లెండింగ్ రేట్లను సవరించినట్లు ఎస్ బీఐ వివరించింది.
అయితే, ఎంసీఎల్ఆర్, బీపీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. కాగా, హోమ్ లోన్స్ కు రెపో రేటును అనుసంధానించేందుకు 2019 అక్టోబర్ 1 నుంచి ఎస్ బీఐ ఈబీఎల్ఆర్ విధానాన్ని అనుసరిస్తోంది. దీంతో ఆర్ బీఐ రెపో రేటు మారినప్పుడు ఈ రేటు మారుతుంది. దీని ప్రభావం ఖాతాదారుల రుణాలపై పడుతోంది. రెపో రేటు తగ్గినప్పుడు బ్యాంకుకు చెల్లించే ఈఎంఐ తగ్గుతుంది. ఈబీఎల్ఆర్ తో లింక్ అయిన హోమ్ లోన్స్ తో పాటు పర్సనల్ లోన్స్, ఇతర లోన్లపైనా వడ్డీ రేటు తగ్గుతాయి.