Jubilee Hills: జూబ్లీహిల్స్ లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం.. ట్రాఫిక్ పోలీస్ బూత్ ను ఢీకొట్టిన వైనం

- ఈ తెల్లవారుజామున జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ప్రమాదం
- ట్రాఫిక్ పోలీస్ బూత్ గోడ పూర్తిగా ధ్వంసం
- కారు మాలిక్ జెమ్స్ అండ్ జువెలరీ పేరిట ఉన్నట్టు గుర్తింపు
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద బీఎండబ్ల్యూ కారొకటి బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు ఏకంగా ట్రాఫిక్ పోలీస్ బూత్ ను ఢీకొట్టింది. ఈ ఘటన ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. కారుపై రెండు పెండింగ్ చలాన్లు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ కారు (టీఎస్ 09 ఎఫ్ఐ 9990) మాలిక్ జెమ్స్ అండ్ జువెలరీ పేరిట రిజిస్టర్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కారు ఢీకొట్టడంతో ట్రాఫిక్ పోలీస్ బూత్ గోడ పూర్తిగా ధ్వంసమయింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. కారు ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారు నడిపిన వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.