HIV: కోడలికి హెచ్ఐవీ వైరస్ ఉన్న ఇంజెక్షన్.. యూపీలో దారుణం

In laws inject bahu with HIV infected needle after family fails to meet dowry demands

  • అదనపు కట్నం కోసం అత్తింటివారి దుశ్చర్య
  • వైద్య పరీక్షల్లో మహిళకు హెచ్ఐవీ సోకినట్లు నిర్ధారణ
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలి కుటుంబం

అదనపు కట్నం కోసం ఓ కుటుంబం దారుణానికి తెగబడింది.. కొత్త కోడలిని నిత్యం వేధింపులకు గురిచేసింది. హెచ్ఐవీ బాధితుడికి ఉపయోగించిన సిరంజీతో కోడలికి బలవంతంగా ఇంజెక్షన్ చేసింది. దీంతో ఆమె హెచ్ఐవీ బారిన పడింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదుకు తిరస్కరించడంతో బాధితురాలి కుటుంబం కోర్టుకెక్కింది. చివరకు న్యాయస్థానం ఆదేశాలతో బాధితురాలి అత్తింటివారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్ లో చోటుచేసుకుందీ దారుణం. బాధితురాలి కుటుంబం వెల్లడించిన వివరాల ప్రకారం.. 

2023 ఫిబ్రవరిలో సహరన్ పూర్ కు చెందిన యువతికి హరిద్వార్ కు చెందిన యువకుడికి వివాహం జరిగింది. ఈ వేడుక కోసం రూ.45 లక్షలు ఖర్చు చేసినట్లు బాధితురాలి తండ్రి చెప్పారు. రూ.15 లక్షల కట్నంతో పాటు కారును బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. అయితే, అదనంగా మరో పది లక్షలు, పెద్ద కారు తీసుకురావాలని అత్తింటివారు తమ కూతురుని వేధించారని చెప్పారు. పెళ్లి జరిగిన తర్వాతి రోజు నుంచే వేధింపులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. మార్చిలో తన కూతురు పుట్టింటికి వచ్చేసిందని, మూడు నెలల తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించామని చెప్పారు.

ఆ తర్వాత అల్లుడు తన కూతురును కాపురానికి తీసుకెళ్లాడని వివరించారు. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని, శారీరకంగా, మానసికంగా తన కూతురుపై దాడి జరిగిందని తెలిపారు. 2024 మే నెలలో తన కూతురుకు ఆమె భర్త, అత్త, ఇతర కుటుంబ సభ్యులు బలవంతంగా హెచ్ఐవీ సోకిన నీడిల్ తో ఇంజెక్షన్ చేశారని ఆరోపించారు. దీంతో తన కూతురు హెచ్ఐవీ బారిన పడిందని కోర్టుకు తెలిపారు. కాగా, కోర్టు ఆదేశాలతో బాధితురాలి భర్త, అత్త, ఆడపడుచు, ఆమె భర్తలపై కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News