Rashmika Mandanna: హీరోయిన్ రష్మికపై కన్నడిగుల కన్నెర్ర.. కారణమిదే!

- ఛావా ప్రమోషన్స్ లో రష్మిక వ్యాఖ్యలు వైరల్
- తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పుకొచ్చిన కన్నడ బ్యూటీ
- ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతున్న కన్నడిగులు
- సొంతూరు విరాజ్‌పేట గురించి చెప్పకపోవడంపై కన్నడ వాసుల ఆగ్రహం
- కర్ణాటకకు చెందిన రష్మిక ఎప్పుడు హైదరాబాదీ అయిందో చెప్పాలని పోస్టులు
ప్రస్తుతం హీరోయిన్ రష్మిక మందన్న హవా కొనసాగుతోంది. ఆమె పట్టిందల్లా బంగారం అన్నట్టుగా.. ఉత్తర, దక్షిణాది ఇండస్ట్రీలలో వరుస హిట్స్ సాధిస్తున్నారు. ఇటీవల తెలుగులో పుష్ప-2తో బ్లాక్‌బస్టర్ అందుకున్న కన్నడ బ్యూటీ.. ఇప్పుడు హిందీలో ఛావాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
దాంతో రష్మిక మరో వివాదంలో చిక్కుకుంది. 'ఛావా' ప్రమోషన్స్ లో భాగంగా తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పుకొచ్చారామె. "నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది" అని అన్నారు. రష్మిక ఇలా అనడం ఇప్పుడు కర్ణాటకలో చర్చకు దారితీసింది. ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతూ నటిపై కన్నడిగులు కన్నెర్ర చేస్తున్నారు.
సొంతూరు విరాజ్‌పేట గురించి చెప్పకపోవడాన్ని కన్నడ వాసులు సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు. కర్ణాటకకు చెందిన రష్మిక ఎప్పుడు హైదరాబాదీ అయిందో చెప్పాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే కన్నడలో ఆమె సినిమాలు చేయకపోవడం పట్ల కూడా కన్నడిగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక కర్ణాటక కొడగు జిల్లా విరాజ్‌పేటకు చెందిన రష్మిక.. హీరోయిన్ గా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎంట్రీ ఇచ్చారు. తొలిసారి రక్షిత్ శెట్టితో కలిసి ఆమె 'కిరిక్ పార్టీ' అనే మూవీలో నటించారు. ఆ తర్వాత రష్మిక తెలుగులో 'ఛలో' సినిమాతో పరిచయమై.. వరుస చిత్రాలతో బాగా పాప్యులర్ అయ్యారు. అటు బాలీవుడ్ లో 'పుష్ప', 'యానిమల్' చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు 'ఛావా'తో మరో హిట్ కొట్టి ఆ క్రేజ్ మరింత పెంచుకున్నారు.