Elon Musk: ఎలాన్ మస్క్ ద్వారా బిడ్డను కన్నా.. రచయిత్రి ఆష్లీ ప్రకటన

- ఐదు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడి
- ఆ బిడ్డకు తండ్రి టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ అని వివరణ
- ఇప్పటికే భార్య, ప్రియురాళ్లతో 12 మంది పిల్లలను కన్న మస్క్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ద్వారా తానో బిడ్డకు జన్మినిచ్చానంటూ ప్రముఖ రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన ప్రకటన చేశారు. ఐదు నెలల క్రితం తనకు బిడ్డ పుట్టిందని, ఆ బిడ్డ తండ్రి మస్క్ అని పేర్కొంటూ ఆమె ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. బిడ్డ భద్రత, తమ గోప్యత వంటి కారణాలతో ఈ విషయాన్ని బయటపెట్టలేదని చెప్పారు. అయితే, కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రచురించే ప్రయత్నం చేస్తుండడంతో అనవసర వివాదానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో మస్క్ తో తన బంధాన్ని తానే బయటపెడుతున్నట్లు వివరించారు. మా బిడ్డ ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలని మేం కోరుకుంటున్నాం.. మా గోప్యతకు భంగం కలిగించవద్దు అంటూ ఆష్లీ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆష్లీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలాన్ మస్క్ మాత్రం ఇప్పటి వరకూ ఈ విషయంపై స్పందించలేదు.
మస్క్ కు 12 మంది సంతానం
భార్య, ప్రియురాళ్లతో ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు 12 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. మొదటి భార్య జస్టిన్ ద్వారా కలిగిన తొలి సంతానం పుట్టిన పది వారాల్లోనే చనిపోయింది. ఆ తర్వాత ఐవీఎఫ్ విధానంలో ఆ జంట ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కెనెడియన్ సింగర్ గ్రిమ్స్ ద్వారా ముగ్గురు పిల్లలు, న్యూరాలింక్ ఉద్యోగితో మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు మస్క్ చెప్పారు. తాజాగా రచయిత్రి ఆష్లీ కూడా తన బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్ అని ప్రకటించడం గమనార్హం.