CEC Appointment: తదుపరి సీఈసీ ఎంపికకు పీఎం మోదీ నేతృత్వంలో 17న ఉన్నత స్థాయి కమిటీ భేటీ

- ఈ నెల 18న సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ విరమణ
- నూతన సీఈసీ ఎంపికకు ప్రధాని మోదీ నేతృత్వంలో 17న కమిటీ సమావేశం
- కమిటీలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ, హోంమంత్రి అమిత్ షా సభ్యులు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీఈసీ ఎంపికకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈ నెల 17న సమావేశం కానుంది. ఈ కమిటీలో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ సోమవారం ప్రధాని నివాసంలో భేటీ కానుంది. సెర్చ్ కమిటీ రూపొందించిన అభ్యర్ధుల జాబితా నుంచి ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఒకరి పేరు సిఫార్సు చేస్తుంది. దాని ఆధారంగా రాష్ట్రపతి తదుపరి సీఈసీని నియమిస్తారు. సీఈసీ పదవీ విరమణ సమయంలో ఎన్నికల సంఘంలో అత్యంత సీనియర్ కమిషనర్‌కు సీఈసీగా పదోన్నతి కల్పిస్తారు. ఈ సంప్రదాయం నేపథ్యంలో సీనియర్ కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్ కుమార్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.