AR Constable: తుపాకి, 30 రౌండ్ల బులెట్లు ఉన్న కానిస్టేబుల్ బ్యాగ్ మిస్సింగ్.. సమాచారమిస్తే నగదు బహుమతి

AR Constable bag containing ammunition goes missing

  • ఈ నెల 12న రాత్రి కనపాకలో బ్యాగ్ మిస్సింగ్
  • ఇద్దరు యువకులు దీనిని తీసి ఉండొచ్చని అనుమానం
  • బ్యాగ్ ఇచ్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని పోలీసుల స్పష్టీకరణ
  • ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన ఎస్పీ

మన్యం జిల్లాలోని పార్వతీపురానికి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ జీవీ రమణకు చెందిన చేతి సంచి విజయనగరంలో అదృశ్యమైంది. అందులో  9 ఎంఎం కార్బైన్ గన్‌కు చెందిన 30 రౌండ్ల బుల్లెట్లు ఉండటంతో ఆందోళన మొదలైంది. ఈ సంచికి సంబంధించి కానీ, అందులోని మందుగుండు గురించి కానీ ఏదైనా సమాచారం ఉంటే తమకు అందించాలని పోలీసులు కోరారు.  

పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 12న రాత్రి 9 గంటల సమయంలో కనపాకలోని కలెక్టర్ ఆఫీస్ రోడ్డుకు ఎదురుగా ఉన్న లెంక శ్రీనివాస్ ఆసుపత్రి సమీపంలో జరిగిందీ ఘటన. చందనం రంగులో ఉన్న ఈ లేడీస్ హ్యాండ్‌బ్యాగ్‌ను కానిస్టేబుల్ పొరపాటున అక్కడ మర్చిపోయారు. అక్కడున్న సీసీటీవీలను పరిశీలించగా అందులో కనిపించిన ఇద్దరు యువకులే దీనిని తీసి ఉంటారని అనుమానిస్తున్నారు. 

బ్యాగ్‌ను అప్పగించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని విజయనగరం పోలీసులు హామీ ఇచ్చారు. అంతేకాదు, ఆ సంచికి సంబంధించి నమ్మదగిన ఎలాంటి సమాచారం ఇచ్చినా నగదు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. కాగా, ఈ ఘటనకు బాధ్యుడైన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జీవీ రమణను మన్యం జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News