IPL 2025: ఫోన్ లో ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లు ఉచితంగా చూడడం కుదరదు!

- మార్చి 23 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం
- ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా విలీనం
- జియో హాట్‌స్టార్‌గా కొత్త యాప్
- ఐపీఎల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం వీక్షించాలంటే జియో హాట్‌స్టార్‌లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లకు డబ్బులు చెల్లించాల్సిందే
ఐపీఎల్ 2025 సీజన్ మార్చిలో ప్రారంభం కానున్న విషయం విదితమే. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. రెండో మ్యాచ్ ను గత సీజన్‌లో రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మార్చి 23న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు.
అయితే, ఈ ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. గత సీజన్ వరకు క్రికెట్ అభిమానులు జియో సినిమాలో మ్యాచ్‌లను ఉచితంగా చూశారు. కానీ ఈ సీజన్‌లో ఉచితంగా వీక్షించే అవకాశం లేదు. ఇకపై క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లు మొబైల్‌లో చూడాలంటే రుసుము చెల్లించాల్సిందే.
ఎందుకంటే.. ఐపీఎల్ 2025కు ముందు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా విలీనమయ్యాయి. ఇప్పుడు రెండింటి పేర్లను కలిపి ఒక యాప్‌ను తీసుకువచ్చారు. 'జియో హాట్‌స్టార్' పేరుతో కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌లో అభిమానులు కొన్ని నిమిషాలు మాత్రమే ఐపీఎల్ మ్యాచ్ ఉచితంగా చూసే వీలుంటుంది. పూర్తి మ్యాచ్ చూడాలంటే మొబైల్ వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మూడు నెలల ప్లాన్‌కు రూ.149, సంవత్సరానికి రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. రెండు డివైజ్‌లకు మూడు నెలల కాలానికి రూ.299 చెల్లించాలి. ఈ ప్లాన్‌ను ఏడాదికి పొడిగించాలంటే రూ.899 చెల్లించాలి. దీనితో పాటు మ్యాచ్ మధ్యలో ప్రకటనలు రాకుండా వీక్షించే ప్లాన్‌లను కూడా జియో హాట్‌స్టార్ అందుబాటులోకి తీసుకువచ్చింది.