BSNL: సుదీర్ఘ విరామం తర్వాత లాభాల బాటలో బీఎస్ఎన్ఎల్

- 17 ఏళ్ల తర్వాత లాభాలు ఆర్జించిన బీఎస్ఎన్ఎల్
- మూడో త్రైమాసికంలో రూ.262 కోట్ల లాభాల ఆర్జన
- 2007 తర్వాత సంస్థకు లాభాలు రావడం ఇదే ప్రధమం
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు లాభాల బాట పట్టింది. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీఎస్ఎన్ఎల్ లాభాలు ఆర్జించడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ రూ.262 కోట్ల మేర లాభాలు ఆర్జించింది. 2007 తర్వాత ఈ ప్రభుత్వ రంగ సంస్థ లాభాలు ఆర్జించడం ఇదే తొలిసారి.
ఇందుకు గల కారణాలను సంస్థ వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. వేగంగా నెట్‌వర్క్ విస్తరణ, కొత్త వినియోగదారులు చేరడం, ఖర్చులు తగ్గించుకోవడంతో లాభాలు సాధ్యమయ్యాయని సంస్థ పేర్కొంది. ఈ త్రైమాసికం ఆర్ధిక ఫలితాలు తమకు సంతోషాన్ని కలిగించాయని సంస్థ సీఎండీ రాబర్ట్ జే రవి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి 20 శాతం మేర ఆదాయం వృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఎస్ఎన్ఎల్ మళ్లీ పుంజుకునేందుకు, భవిష్యత్తుపై భరోసాకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఖర్చులు తగ్గించుకోవడంతో ఈ ఏడాది నష్టాలు రూ.1800 కోట్ల మేర తగ్గాయని తెలిపారు. మొబైల్ సేవల రెవెన్యూ 15 శాతం, ఫైబర్ టూ హోమ్ సేవల ఆదాయం 18 శాతం, లీస్ట్ లైన్ సేవల ఆదాయం 14 శాతం పెరిగాయని వెల్లడించారు.
యూజర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా నేషనల్ వైఫై రోమింగ్, మొబైల్ యూజర్లకు బైటీవీ, ఫైబర్ టూ హోమ్ వినియోగదారులకు ఐఎఫ్ టీవీని అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. అత్యద్భుత సేవలు అందించడంతో పాటు 5జీ, డిజిటల్ విప్లవాలను అందిపుచ్చుకునేలా అడుగులు వేస్తూ బీఎస్ఎన్ఎల్ పోటీలో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు.