Anchor Syamala: రంగరాజన్ ను పరామర్శించిన యాంకర్ శ్యామల

- ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి
- ఈ ఘటనను వైసీపీ ఖండిస్తోందన్న శ్యామల
- రంగరాజన్ కు అందరం అండగా ఉంటామని వెల్లడి
వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల నేడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ను కలిశారు. ఇటీవల దాడి జరగడం పట్ల ఆయనను పరామర్శించారు. రంగరాజన్ వంటి గౌరవనీయ వ్యక్తిపై దాడి జరగడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు శ్యామల తెలిపారు. మత సామరస్యం కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. అర్చకుల భద్రతకు సంబంధించిన ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎల్లప్పుడూ న్యాయానికి, ధర్మానికి అండగా ఉంటుందని మరోసారి స్పష్టం చేస్తున్నామని తెలిపారు.
"రంగరాజన్ ఎలాంటి వారు ఆనేది చిలుకూరు ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి తెలుసు. ఆయన నాకు చాలాకాలం నుంచి వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఏ రోజూ ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. అందరికీ స్వామి దర్శనం అందాలని కోరుకునే వ్యక్తి ఆయన.
నడవలేని వాళ్లను చేతుల మీద మోసుకుంటూ తీసుకువచ్చి స్వామివారి దర్శనం చేయిస్తారు. అలాంటి వ్యక్తి మీద చేయి చేసుకోవాలని ఎలా అనిపించిందో అర్థం కావడంలేదు. రంగరాజన్ గారికి అందరం అండగా ఉంటాం" అని శ్యామల స్పష్టం చేశారు.