Pawan Kalyan: తిరుపరకుండ్రం మురుగన్, మధుర మీనాక్షి సేవలో పవన్ కల్యాణ్.... ఫొటోలు ఇవిగో!

- దక్షిణ భారతదేశ ఆలయాలను సందర్శిస్తున్న పవన్
- నేడు మధురైన సమీపంలోని తిరుపరకుండ్రం క్షేత్ర సందర్శన
- ఆలయంలో జనసేనాని ప్రత్యేక పూజలు
- మధుర మీనాక్షి అమ్మవారికి సారె, చీర సమర్పణ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ దేవాలయాల పర్యటనలో భాగంగా షష్ట షణ్ముఖ క్షేత్రాల సందర్శనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం మధురై సమీపంలోని తిరుపరంకుండ్రం శ్రీ మురుగన్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ కు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లారు. ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టతను ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మోకరిల్లి పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ఉన్న శివ, వైష్ణవ ఆలయాలను దర్శించుకుని పూజలు చేసి దైవాశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయం లోపలే ఉన్న వేద పాఠశాలను సందర్శించారు. పవన్ కు చిన్నారులు వేదపఠనం చేసి స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయ రీతిలో ఆయనను వేద పండితులు ఆశీర్వదించి సత్కరించారు.
తిరుపరకుండ్రం మురుగన్ ఆలయ సందర్శన అనంతరం పవన్ మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. పవన్ మొక్కులో భాగంగా అమ్మవారికి సారె, చీరను, పుష్పాలు, ఫలాలను సమర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ తో ఆలయ రుత్విక్కులు ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయంలోనే కూర్చుని పవన్ పరాశక్తి పారాయణం చేశారు.
అనంతరం శ్రీ సోమ సుందరేశ్వర స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ సోమ సుందరేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో పవన్ వెంట ఆయన తనయుడు అకీరా నందన్, సన్నిహితుడు, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద సాయి ఉన్నారు.












