Alleti Maheshwar Reddy: పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి మోదీ కులంపై మాట్లాడారు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

- రేవంత్ రెడ్డి అన్నింటా విఫలమయ్యారని విమర్శ
- రాహుల్ గాంధీ మాట్లాడినట్లుగానే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శ
- రాహుల్ గాంధీ కన్వర్టెడ్ హిందూ అని చురక
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మెప్పు కోసం, తన పదవిని కాపాడుకోవడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులంపై వ్యాఖ్యలు చేశారని తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పాలనలో రేవంత్ విఫలమయ్యారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
రేవంత్ రెడ్డి ఒక ఫ్రస్ట్రేటెడ్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. అన్నింటా విఫలమయ్యారు కాబట్టి ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రాహుల్ గాంధీ ఏవిధంగా మాట్లాడారో ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే తరహాలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఒక బీసీ ప్రధాన మంత్రిగా పదేళ్లు ఉంటే చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డి పిచ్చికూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతమో చెప్పాలన్నారు.
రాహుల్ గాంధీ కన్వర్టెడ్ హిందువు కాదా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అసలు మతం ఏమిటో చెప్పాలన్నారు. కన్వర్టెడ్ హిందువు అయిన రాహుల్ గాంధీ ఇదివరకు నరేంద్ర మోదీపై మాట్లాడారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాగే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు.