Revanth Reddy: తెలంగాణ ఉద్యమంపై లోతైన చర్చ జరగాలి: రేవంత్ రెడ్డి

- దేవేందర్ గౌడ్ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
- తెలంగాణ ఉద్యమంపై సమగ్రమైన పుస్తకాలు రావాలన్న రేవంత్ రెడ్డి
- ఉద్యమంలో దేవేందర్ గౌడ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని వెల్లడి
తెలంగాణ ఉద్యమంపై లోతైన చర్చ జరగాలని, ఉద్యమంలో ఎన్నో వర్గాలు పాల్గొన్నప్పటికీ ఒక కుటుంబమే పాల్గొన్నట్లు వక్రీకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ రచించిన 'విజయ తెలంగాణ' పుస్తకాన్ని హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంపై సమగ్రమైన పుస్తకాలు రావాలని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో దేవేందర్ గౌడ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. గోదావరి జలాలు తెలంగాణలో పారించేందుకు ఆయన ఉద్యమించారని గుర్తు చేశారు. ఉద్యమం సమయంలో ప్రజలంతా 'టీజీ' అని రాసుకున్నారని, అందుకే 'టీఎస్'గా ఉన్న పేరును 'టీజీ'కి మార్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.