Jagan: వల్లభనేని వంశీ అరెస్ట్ పై తీవ్ర స్థాయిలో స్పందించిన జగన్

- గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
- తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్వీట్ చేసిన జగన్
- రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శలు
- అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారంటూ ఆగ్రహం
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. వంశీ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి స్థానం లేకుండా పోయిందని విమర్శించారు. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
"మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వాళ్లు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ ఓ దళిత యువకుడు సాక్షాత్తు జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేశాడు. దాంతో తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటికి వస్తున్నాయని తట్టుకోలేక, దాన్ని కూడా మార్చేసేందుకు చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు.
వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి బెదిరించడం కరెక్టేనా? ఈ కేసు సుప్రీంకోర్టు దృష్టిలో ఉంది. సుప్రీం ఆదేశాలతో దిగువ కోర్టు ఈ కేసును విచారిస్తోంది. అలాంటప్పుడు పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటికి వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరికి జడ్జిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తుండడం అధికార దుర్వినియోగం కాదా?" అంటూ జగన్ ప్రశ్నించారు.
మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. కల్యాణ మంటపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ ను టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం అని జగన్ పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్ల మంది ప్రజలు చూశారు... మరి చర్యలు ఎవరిపై తీసుకోవాలి?" అని ప్రశ్నించారు.
"చంద్రబాబు గారూ... ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజల దృష్టి మరల్చేందుకు మా పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేస్తున్నారు... మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటున్నారు... మీరు తగిన మూల్యం చెల్లించక తప్పదు" అంటూ జగన్ ట్వీట్ చేశారు.