Errabelli: తన ఓటమిపై ఎర్రబెల్లి దయాకరరావు కీలక వ్యాఖ్యలు

Errabelli Dayakar Rao on his defeat in Palakurthy

  • ఓడిపోతానని ఆరు నెలల ముందే తెలుసన్న ఎర్రబెల్లి
  • కేసీఆర్ ప్రోత్సాహంతోనే పోటీ చేసినట్లు వెల్లడి
  • కేసీఆర్ తెలంగాణను పదేళ్లు దార్శనికతతో పాలించారన్న మాజీ మంత్రి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాసనసభ ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ఆరు నెలల ముందే తెలుసని వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ ప్రోత్సాహంతో పోటీ చేసినట్లు చెప్పారు. కేసీఆర్ తెలంగాణను పదేళ్లు దార్శనికతతో పాలించారని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాలా తీయించిందని విమర్శించారు. ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు 100 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ గత ఆరు నెలలుగా రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని అన్నారు. ప్రభుత్వ పనితీరుపై వాకబు చేయడానికి ఇటీవల వరంగల్‌కు రావడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించారని, కానీ తన నిజస్వరూపం బయటపడుతుందని ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఆయన పర్యటనను రద్దు చేయించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సోదరులు, ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News