Champions Trophy 2025: ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి భారీ నగదు బహుమతి... విజేతకు మైండ్‌బ్లోయింగ్ ప్రైజ్ మనీ!

- ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
- ఈ ట్రోర్నీకి సంబంధించి ప్రైజ్ మనీని అధికారికంగా ప్రకటించిన ఐసీసీ
- విజేతకు ఏకంగా రూ. 20.80 కోట్ల నగదు బహుమతి
- రన్నరప్ కు రూ. 10.40 కోట్లు..సెమీస్ చేరిన జట్లకు చెరో రూ. 5.20 కోట్లు
ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ లలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. ప్రతి గ్రూపులో మొదటి రెండు జట్లు సెమీ ఫైనల్స్ కు చేరుకుంటాయి. అయితే, తాజాగా ఐసీసీ ఈ ట్రోర్నీకి సంబంధించి ప్రైజ్ మనీని అధికారికంగా ప్రకటించింది.
విజేతకు ఏకంగా రూ.20.80 కోట్ల నగదు బహుమతి ఇవ్వనుంది. అలాగే రన్నరప్ కు రూ.10.40 కోట్లు, సెమీ ఫైనల్స్ కి చేరిన జట్లకు చెరో రూ.5.20 కోట్లు ఇవ్వనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
ఇక నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచిన టీమ్ లకు తలో రూ.3 కోట్లు... ఏడు, ఎనిమిదో స్థానంలో నిలిచిన జట్లకు చెరో రూ.1.20 కోట్లు అందుకుంటాయి. ఇక చాంపియన్స్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్ కు సుమారు రూ. 29 లక్షలు అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరికెంత ప్రైజ్ మనీ వచ్చిందంటే...?
2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్థాన్ జట్టుకు రూ. 14.18 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. ఇక రన్నరప్ గా నిలిచిన భారత్ రూ.7 కోట్లు అందుకుంది. సెమీస్ కు చేరిన బంగ్లాదేశ్, ఇంగ్లండ్ కు చెరో రూ. 3 కోట్లు దక్కాయి. అలాగే ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు తలో రూ. 58 లక్షలు రాగా... ఆఖరి రెండు స్థానాల్లో ఉన్న శ్రీలంక, న్యూజిలాండ్ కు చెరో రూ. 39 లక్షలు అందాయి.
కాగా, ఈసారి భారత్ తన మ్యాచ్ లను దుబాయ్ వేదికగా ఆడనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత 23న దాయాది పాక్ తో తలపడనుంది. మార్చి 1న న్యూజిలాండ్ తో రోహిత్ సేన తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.