Rape: తలపై కత్తితో పొడిచి.. నోట్లో యాసిడ్ పోసి.. ఏపీలో యువతిపై అత్యాచారం

- అన్నమయ్య జిల్లాలో ఘోరం
- తన ప్రేమను కాదన్నదనే కోపంతో అఘాయిత్యం
- ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలు
ప్రేమ పేరుతో తమ కూతురును ఓ యువకుడు వేధిస్తుండడంతో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి చేసి పంపిస్తే కూతురు సంతోషంగా ఉంటుందని భావించారు. అయితే, ఆ యువకుడు పగతో తమ కూతురు జీవితాన్ని నాశనం చేస్తాడని ఊహించలేకపోయారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా ప్యారంపల్లె గ్రామంలో ఓ యువతిపై ఘోరంగా అత్యాచారం జరిగింది. ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. అత్యంత పాశవికంగా బాధితురాలి నోట్లో యాసిడ్ పోసి, తలపై కత్తితో పొడిచాడు. బాధతో అరుస్తున్నా కనికరించకుండా దారుణంగా అత్యాచారం చేసి పారిపోయాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లె గ్రామానికి చెందిన యువతిని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ వేధింపులకు గురిచేశాడు. ప్రేమిస్తున్నాననంటూ వెంటపడుతుండేవాడు. ఈ విషయాన్ని ఆ యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. పెళ్లీడుకు వచ్చిన కూతురు అభాసుపాలవుతుందనే భయంతో తల్లిదండ్రులు ఆమెకు సంబంధం కుదిర్చి ఏప్రిల్ 29 న పెళ్లి నిశ్చయం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న గణేష్ ఆ యువతిపై కోపం పెంచుకున్నాడు. ఒంటరిగా వెళుతున్న సమయం చూసి యువతిపై దాడి చేశాడు. కత్తితో తలపై పొడిచి, నోట్లో యాసిడ్ పోశాడు. దారుణంగా అత్యాచారం చేసి పారిపోయాడు. యువతిని గమనించిన స్థానికులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.