Trump: టారిఫ్ ల విషయంలో తగ్గేదే లేదంటున్న ట్రంప్.. భారత్ కు మినహాయింపేమీ లేదని వెల్లడి

Trump unveils roadmap for reciprocal tariffs on US allies

  • మీరెంత వేస్తే మేమూ అంత వేస్తామని స్పష్టం చేసిన ట్రంప్
  • విదేశాల అధిక సుంకాలు ఇక అమెరికాకు సమస్య కాదని వివరణ
  • మోదీతో భేటీకి ముందే ఉత్తర్వులపై సంతకం

అమెరికా ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. అమెరికాపై పన్నులు విధించే ఏ దేశమైనా సరే అంతే మొత్తంలో అమెరికా నుంచి టారిఫ్ లు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘మీరు ఎంత విధిస్తే మేమూ అంతే విధిస్తాం.. ఇందులో ఎక్కువ తక్కువలకు చోటులేదు’ అని చెప్పారు. ఈ విషయంలో తగ్గేదేలేదని, మిత్ర దేశమే అయినప్పటికీ భారత్ కు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వలేమని అన్నారు. విదేశాల నుంచి తాము చాలా ఎక్కువ పన్నులు ఎదుర్కొంటున్నామని ట్రంప్ వివరించారు. తన మొదటి టర్మ్ లో ఈ విషయంపై ఆయా దేశాలతో సంప్రదింపులు జరిపినా ఎలాంటి రాయితీ పొందలేకపోయామని ట్రంప్ గుర్తుచేశారు. దీంతో పరస్పర పన్నులు విధించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఇకపై అమెరికాకు విదేశాల అధిక సుంకాల బాధ తప్పుతుందని చెప్పారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి కొన్ని గంటల ముందే ట్రంప్ ఈ రెసీప్రోకల్ టారిఫ్ ల ఫైలుపై సంతకం చేశారు. అమెరికా వస్తువులపై ఏ దేశమైనా ఎంత పన్ను విధిస్తుందో అంతే మొత్తంలో ఆయా దేశాలపై అమెరికా పన్ను విధిస్తుందని స్పష్టం చేశారు. అమెరికా ప్రజలకు సంబంధించినంత వరకు ఇది సరైన చర్యేనని సమర్థించుకున్నారు. యూరప్ దేశాలు, చైనా తమపై అత్యధిక పన్నులు విధిస్తున్నాయని ట్రంప్ చెప్పారు. చాలా విషయాల్లో అడ్వాంటేజ్‌ తీసుకొంటున్నాయని, దీనిపై అమెరికా ఏమాత్రం సంతృప్తిగా లేదని వివరించారు. తాను అధికారంలోకి రాకముందు చైనాపై అమెరికా ఎలాంటి పన్ను విధించేది కాదని, తన మొదటి టర్మ్ లో చైనాపై పది శాతం పన్ను విధించానని ట్రంప్ గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News