Mumbai Blasts: ముంబై పేలుళ్ల నిందితుడి అప్పగింతకు ట్రంప్ ఆమోదం

- ప్రధాని నరేంద్ర మోదీతో భేటీలో వెల్లడించిన ట్రంప్
- అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ కు అప్పగిస్తున్నట్లు వెల్లడి
- ట్రంప్ కు కృతజ్ఞతలు చెప్పిన మోదీ
ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తహవుర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు సిద్ధమని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడిని భారత్ కు అప్పగించబోతున్నట్లు తెలిపారు. ముంబై పేలుళ్ల కేసులో బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, ఈ విషయంలో భారత్ కు అమెరికా పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.
2008 సెప్టెంబర్ 26న ముంబైలో పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. సముద్ర మార్గంలో ముంబై చేరుకున్న ఉగ్రవాదులు తాజ్ హోటల్ తో పాటు పలుచోట్ల బాంబు దాడులకు పాల్పడ్డారు. కాల్పులు జరిపి మారణహోమం సృష్టించారు. పోలీసుల దర్యాఫ్తులో ఈ దాడికి కీలక సూత్రధారి తహవుర్ రాణా అని తేలింది. దీంతో భారత ప్రభుత్వం లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. పాకిస్థాన్ మూలాలు ఉన్న తహవుర్ రాణా అమెరికాలో ఉంటున్నాడు.
ఓ కేసులో ఆయనను అమెరికా పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. రాణాను తమకు అప్పగించాలని అమెరికాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. చాలా రోజులుగా పరిశీలనలో ఉన్న ఈ ఫైలులో ట్రంప్ బాధ్యతలు చేపట్టాక కదలిక వచ్చింది. నేరస్థుల అప్పగింతలో భాగంగా రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా ఆమోదం తెలిపారు. ట్రంప్ ప్రకటనపై మోదీ స్పందిస్తూ.. ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు.