PM Modi: ట్రంప్ తో భేటీలో అక్రమ వలసలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

- చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి ఆ దేశంలో ఉండే హక్కు ఉండదన్న ప్రధాని
- అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని ప్రకటన
- అగ్రరాజ్యం అధ్యక్షుడితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మోదీ
అక్రమ వలసలు ప్రపంచంలోని ఏ దేశానికైనా సమస్యేనని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఎవరైనా సరే ఓ దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడే సెటిలవుతామని అంటే కుదరదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా అడుగుపెట్టిన వారికి ఆ దేశంలో ఉండే హక్కు ఉండదని తేల్చిచెప్పారు. ఇది ప్రపంచంలోని ఏ దేశానికైనా వర్తిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలోకి అక్రమ వలసలపై మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని, ఈ విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ కు సహకరిస్తామని చెప్పారు.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల్లో చాలామంది హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడ్డవారేనని మోదీ చెప్పారు. కొంతమంది స్వార్థపరులు ఉద్యోగాలు, డాలర్ల ఆశజూపి అమాయకులను మోసం చేస్తున్నారని చెప్పారు. వారి మాయమాటలు నమ్మి అడ్డదారుల్లో యువత, పేదరికంతో బాధపడుతున్న వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారని వివరించారు. ఏం జరుగుతోందో, ఏంచేస్తున్నామో తెలియకుండానే వారు ఈ అక్రమ రవాణా కూపంలోకి అడుగుపెడుతున్నారని తెలిపారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా భారత్ ప్రయత్నిస్తుందని, దీనికి ట్రంప్ సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు.