IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో తొలి మ్యాచ్ ఎప్పుడు, ఎవరి మధ్య అంటే..!

- ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్ కు సంబంధించి 'క్రిక్‌బజ్' కథనం
- తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో మార్చి 22న
- తొలి మ్యాచ్ లో తలపడనున్న కేకేఆర్, ఆర్‌సీబీ
- మే 25న ఈడెన్ గార్డెన్స్ లోనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్ కు సంబంధించి కీలక వివరాలను 'క్రిక్‌బజ్' కథనం వెల్లడించింది. "బీసీసీఐ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య జరగనుంది. గత ఏడాది రన్నరప్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తర్వాతి రోజు మధ్యాహ్నం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో తలపడుతుంది. ఇక మే 25న (ఆదివారం) ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది" అని పేర్కొంది.
అలాగే అహ్మదాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు, లక్నో, ముల్లాన్‌పూర్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, హైదరాబాద్ లతో పాటు గౌహతి, ధర్మశాల కూడా మ్యాచ్‌లను నిర్వహిస్తాయని కథనం పేర్కొంది.
మార్చి 26, 30 తేదీల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండు 'హోమ్' మ్యాచ్ లు గువాహటి వేదికగా జరిగే అవకాశం ఉందని తెలిపింది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఈ మ్యాచ్ లలో ఆర్ఆర్ తో పోటీ పడతాయని పేర్కొంది. అలాగే ధర్మశాల మైదానం పంజాబ్ కింగ్స్ జట్టు రెండు హోమ్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వవచ్చని తెలిపింది.
కాగా, జనవరి 12న ముంబయిలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి హాజరైన బిసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, మార్చి 23 నుంచి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే.